బావగారు బాగున్నారా

గిరి చెల్లెలి పెళ్ళి విజయవాడలో. ‘ఆ వంక ఈ వంక చెప్పి రాకపోయావో కాళ్ళుచేతులు విరగ్గొడత’ ఇది వాడి పెళ్ళి పిలుపు. “నీ చెల్లెలు వేరు నా చెల్లెలు వేరట్రా, రాకుండ ఎలా ఉంటాను” అన్నాను. ఆదివారం పెళ్ళి రెండు రోజులు ముందు వెళ్ళి పెళ్ళైన తరువాత మరో రెండు రోజులుండి తీరిగ్గ చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగొద్దామనుకున్నాను. “నాన్న నీకేమయిన ఇబ్బందనిపిస్తే ఫోన్ చెయ్యి వచ్చేస్తాను” అన్నాను. “లేదురా వెళ్ళిరా. అసలు నేనే చెబుదామనుకున్నాను. నీ వయసు కుర్రాళ్ళు సరదాగ తిరుగుతుంటె నువ్వు మాత్రం వయసుకి మించిన భాధ్యతల్ని నెత్తినేసుకుని నాతోబాటు కష్టపడుతున్నావు. నాలుగు రోజులు బిజినెస్ గొడవలన్ని మర్చిపోయి హ్యాపిగా వెళ్ళిరా” అన్నారు నాన్న. “ఒరేయ్. అక్కడ హోటల్ లో రూము గట్రా చెయ్యాల్సిన అవసరం లేదు. లత అత్తయ్యకు ఉత్తరం రాసాను. తను కూడ నిన్ను ఎక్కడికి వెళ్ళకుండ నేరుగా వాళ్ళింటికే వచ్చి ఉండమని ఉత్తరం రాసింది” అంది అమ్మ. “లత అత్తయ్యా?” అన్నాను.

“అదేరా మన పక్కింట్లో ఉండేవాళ్ళు. నువ్వప్పుడు చాల చిన్నవాడివిలే” అంది. నాకు గుర్తుకొచ్చింది. వాళ్ళు మా పక్కింట్లో బాడుగకుండేవాళ్ళు. వాళ్ళాయన ఏదో గవర్నమెంట్ జాబ్ చేసేవారు. తనకి విజయవాడకి ట్రాన్స్ ఫర్ అయ్యిందని వెళ్ళినవాళ్ళు అక్కడే స్వంత ఇల్లు కొనుక్కుని సెటిల్ అయిపోయారు. అమ్మ తను కొన్నాళ్ళు ఉత్తరాలు రాసుకునేవారు. కొన్నాళ్ళకి వాళ్ళాయన చనిపోయరాని తెలిసింది. ఆ తరువాత ఏవయ్యింది తెలియలేదు. నేను డిగ్రి పూర్తిచేసుకుని నాన్నకు బిజినెస్ లో సహాయం చేస్తున్నాను. “ఈ మొబైల్ యుగంలోకూడ ఉత్తరాలు రాసుకునేవాళ్ళు ఆంధ్రలో మీరిద్దరే అనుకుంటా” అన్నాను నవ్వుతు. “ఫోన్ నంబరు కూడ ఊందిలేరా. ఏదో మా చాదస్తం మాది. తన అడ్రస్, ఫోన్ నంబర్ రాసి టేబుల్ మీద పెట్టాను చూడు. గుర్తుగా సూట్ కేస్ లో పెట్టేసుకో” అంది. హౌరాకి టికెట్ బుక్ చేసుకున్నాను. “విజయవాడకు చేరేటప్పటికి సాయంత్రం అవుతుంది. మధ్యలో ఆ రైల్వేప్లాట్ ఫారం మీద దొరికేవి తింటే ఆరోగ్యం పాడవుతుంది. నేనే భోజనం కట్టిస్తాను. అత్తయ్యకు కొన్ని ప్యాక్ చేసిస్తాను, ఇచ్చెయ్” అంటు అమ్మ నానా హంగామ చేసింది. విజయవాడ చేరేటప్పటికి మబ్బుపట్టుంది. అకాల వర్షం. అడ్రస్ పక్కాగ ఉండడంవల్ల త్వరగానే ఇల్లు చేరాను. అత్తయ్య మొహం నాకు లీలగా గుర్తుంది. తనలో పెద్ద మార్పేమీ కనబడలేదు. వయసు మీదపడడంవల్ల కొంచెం నలిగినట్లు కనబడుతోందంతే. నన్ను చూసి చాల సంతోషపడింది. “ఎంత పెద్దవాడివయ్యావురా. అన్నయ్య ఒదిన బాగున్నారా? నాన్న బిజినెస్ ని నువ్వు బాగ ఇంప్రూవ్ చేసావటగా. ఒదిన ఉత్తరం రాసిందిలే. ఉత్తరం నిండ నిన్ను పొగిడింది” అంది. “ఇప్పుడుకూడ ఉత్తరాలు ఏంటత్తయ్యా? అమ్మకూ ఇదేమాట చెప్పాను.” అన్నాను. “ఏదోలేరా, పాత తరం వాళ్ళం. మావయ్య పోయారు సరే, అత్తయ్యకూడ చచ్చిపోయిందనుకున్నావట్ర? ఒక్కసారైన వచ్చి పలకరించావ?” అంది.”అలాంటి మాటలెందుకు? చదువు తరువాత నాన్నకు సహాయం చెయ్యడంలోనే సరిపోయింది. నువ్వు మాత్రం ఎన్నిసార్లు వచ్చావేంటి మమ్మల్ని చూడడానికి?” అన్నాను.

“పోనీలే ఈ పెళ్ళివంకతోనైన మేము గుర్తొచ్చాము. అయ్యో.. మాటల్తోనే సరిపెట్టేసాను. కాఫి తాగుతావా? టీనా?” అంది. “ఏదైన ఫర్వాలేదు” అన్నాను. తను వంటగదినుంచే అదీఇదీ అడుగుతుంటే జవాబు చెబుతూ సోఫాలో కూర్చున్నాను. కాస్సేపటికి అందమైన ఓ అమ్మాయి గేట్ తెరుచుకుని లోపలికి రావడం కనబడింది. లంగాఓణిలో అచ్చం బాపు బొమ్మలా ఉంది. విజయవాడ అమ్మాయిల అందం గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ముందు తలుపు తెరిచే ఉండడంవల్ల ఆ అమ్మాయి నేరుగా ఇంట్లోకే వస్తోంది. “అత్తయ్యా, ఎవరో వచ్చారు చూడు” అన్నాను గట్టిగ. ఆ అమ్మాయి నా దగ్గరికే వచ్చి “బాగున్నావా బావా? ఎప్పుడొచ్చావు? అత్తయ్య, మావయ్య ఎలా ఉన్నారు?” అనడిగింది. నేను నోరెళ్ళబెట్టి ఆ అమ్మాయివంకే చూస్తున్నాను.”అదేంటి బావా అలా చూస్తున్నావు?” అంటోంది ఆ అమ్మాయి చనువుగా నా భుజం పట్టుకుని కుదుపుతు. అత్తయ్య బయటకొచ్చి కాఫి కప్ నా చేతిలో పెట్టి నవ్వుతూ ” ఎవరనుకున్నావురా? నా కూతురు సంధ్య” అంది. నేను మళ్ళి నోరెళ్ళబెట్టాను. (ఇంకా ఉంది)

Share this:

ABOUT THE AUTHOR

Hello We are OddThemes, Our name came from the fact that we are UNIQUE. We specialize in designing premium looking fully customizable highly responsive blogger templates. We at OddThemes do carry a philosophy that: Nothing Is Impossible