అమ్మాయిల కామన్ రూం అంతా గోల గోలగా వుంది. రాజేష్ ఖన్నాలాంటి ఏక్టరే లేడని పావుగంట నుంచి వాదిస్తూంది జ్యోతి.“పోతే, అనవసరంగా ఎందుకో అంత పేరొచ్చిందిగాని ధర్మేంద్ర, సంజీవ్, అమితాబ్ – వీళ్ళందరి ముందు మీ సూపర్ స్టార్ వెలవెలబోతాడే” నీరజ హేళనగా అంది.
“ఆ…. పెద్ద చెప్పావ్ లే, ఆనంద్, అమర్ ప్రేమ, ఆవిష్కార్ చూశావా నీవసలు -” కోపంగా రెట్టించింది జ్యోతి.
“ఆ…. చూశాలేవోయ్. ఏదో – రెండో మూడో పిక్చర్లు వేళ్ళమీద లెక్కపెట్టచ్చు. ఏదో ఏక్ట్ చేస్తాడులేగాని సంజీవ్ కుమార్ లా చేయగల డేమిటి అసలు? సంజీవ్ చూడు ఏ రోల్ యీయనీ మంచవు, చెడ్డవు, చిన్నవు, పెద్దదవు ఎంత యీజీగా ఏక్ట్ చేసి పారేస్తాడు? అతని కోషీష్, షోలే, పరిచయ్, మౌనమ్, అర్జున్ పండిట్. ఏదీ చూడనీ ఏక్షనే కాదే రోల్ లో జీవిస్తాడే. ఏది మీ సూపర్ స్టార్ చేయగలడే అలా?” ఆవేశంగా అంది సరళ.
“ఆ. గుల్జార్ లాంటి డైరెక్టర్ వుంటే…” జ్యోతి హేళనగా అంది.
“ఆ… అదే – కాస్త మంచి డైరెక్టర్ చేతిలోపడితే కాస్త రాణిస్తాడు. మీ రొమాంటిక్ హీరో. సంజీవ్ అయితే ఎలాంటి డైరెక్టర్ అవనీ, ఎంత చెత్త పిక్చర్ అవనీ, ఎంత చిన్న రోల్ అవనీ, తన మేరకి తను ఎప్పుడూ ఫేలవడే తెలుసా?” మరింత ఆవేశంగా అంది నీరజ.
“పోదూ – వాడూ, వాడిపొట్టా – ముసలివేషాలకి తప్ప పనికిరాడు” వెక్కరించింది జ్యోతి. తననే అన్నట్టు ఉక్రోషం ముంచుకువచ్చింది నీరజకు.
“ఆ…. విగ్రహపుష్టి వుంటే చాలేమిటి…. అసలు సంజీవ్ లావు అవనీ, పొట్ట వుండనీ సంజీవ్ ని చూస్తుంటే ఎవరికీ ఆ విషయమే గుర్తురాదు. ఆ ఏక్షన్ కి అంతా తల వంచాల్సిందే – ఏదీ అలాంటి ముసలి వేషాలు మీ వాడు వెయ్యగలడా సంజీవ్ యిటు రొమాంటిక్ వీ వేయగలడు, అటు ముసలివేషాలు వేస్తాడు. అటు సీరియస్, యిటు లైట్ కామెడీరోల్స్ ఏదిచ్చినా దంచి పారేస్తాడు…. మీ రొమాంటిక్ హీరో అనుమానపు మొగుడి వేషాలు వేయమంటే మొహం మాడ్చుకు కూర్చునే రోల్స్ చేస్తాడు _” కసిగా దెబ్బతీసినట్లు అంది గర్వంగా నీరజ.
“వాటెబౌట్ అమితాబ్?- అమితాబ్ గొంతు నాకెంత ఇష్టమో, ఎంత మెజస్టిక్ గా లాగులు చెపుతాడో -” షీలా అందుకుంది.
“”ఆఫ్ కోర్స్. అమితాబ్ యీజ్ ఏ గుడ్ ఏక్టర్ – కానీ సీరియస్ వేషాలకి మాత్రమే పనికొస్తాడే, ఏంగ్రీ యంగ్ మాన్ రోల్స్ మాత్రమే నప్పుతాయి” నీరజ కొట్టిపారేసింది.
“ఏమో, నాకుమాత్రం ధర్మేంద్ర నచ్చుతాడు” పద్మ సాగదీస్తూ అంది.
“ధర్మేంద్రలో వర్తువుందే – కాని ప్రతీ చెత్తరోలు వప్పేసుకుని యీ మధ్య చెత్తగా తయారవుతున్నాడు. సత్యకామ్, అనుపమ ఎంత బాగా చేశాడే – మంచి డైరెక్టరు చేతిలోపడితే బాగా షైన్ అవుతాడే. అయితే తనవరకు ఏరోల్ పాడుచెయ్యడు. కాస్త నెలక్టివ్ గా వుంటే బాగుండు” కుర్రాడు పాడయిపోతూంటే బాధపడే తల్లిలా బాధపడుతుంది సీమ.
“ఎవరేం చెప్పండి, సంజీవ్ కి ఫస్ట్ క్లాస్ యివ్వాల్సిందే” ఇవ్వకపోతే తంతానన్నట్టు గట్టిగా దబాయించింది నీరజ.
“అబ్బబ్బ – మీకు సినిమాగోల తప్ప మరేం అక్కరలేదేమిటి? ఎవరు ఫస్టు, ఎవరు లాస్ట్ అయితే మనకేం. బావుంటే సినిమా చూడచ్చు లేకపోతే మానచ్చు. దానికోసం ఎందుకలా దెబ్బలాడుకుంటారు? ఒక్కక్షణం మాట్లాడకుండా నిశ్శబ్దంగా వుండలేరు” విసుగ్గా మందలించింది విమల చదువుతున్న నోట్స్ పక్కనపెట్టి.
“గ్రాండ్ మా – నిశ్శబ్దంగా వుండడానికి ఇది క్లాస్ రూము కాదు – కామన్ రూమ్. నిశ్శబ్దం కావాలంటే హాయిగా క్లాస్ రూములో కూర్చుని చదువుకో తల్లీ. మమ్మల్ని సాదించి చంపక” అంది జ్యోతి.
ఆ కాలేజీలో విమలకి గ్రాండ్ మదర్ అని పేరుపెట్టారు అమ్మాయిలు. గోలకి, సందడికి, సరదాలకి దూరంగా వుంటూ ఎగిరిపడుతూన్న అమ్మాయిలని కాస్త మందలిస్తూ, పెద్దదానిలా మాట్లాడుతుందని అమ్మాయిలు అంతాకల్సి గ్రాండ్ మదర్ అని పేరు సెలెక్టుచేశారు వేళాకోళంగా. అయినా విమల బాధపడదు.
“కామన్ రూం అయితే చేపలబజారు చేసుకోవాలా? అరగంటనించి చూస్తున్నా మీ వాదన. సంజీవ్ కుమార్, రాజేష్ ఖన్నా అభిమాన సంఘాలు తయారుచేయమని మీకు డబ్బిచ్చినట్టు కొట్టుకుచస్తున్నారు. బై ది బై ఎంతిచ్చారేమిటి మీకు?” అంది నవ్వుతూ విమల.
“అబిమాన సంఘాలు, పేడలు కొట్టుకోడాలు మన హీరోలకే, వాళ్ళకవేంలేవు” ఉడుక్కుంది జ్యోతి
ABOUT THE AUTHOR
Hello We are OddThemes, Our name came from the fact that we are UNIQUE. We specialize in designing premium looking fully customizable highly responsive blogger templates. We at OddThemes do carry a philosophy that: Nothing Is Impossible